Shubhanshu Shukla News | సుమారు 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. ఈ సందర్భం భారతీయులందరికీ ఎంతో గర్వకారణం.
యాక్సియం-4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురిని తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. శుభాంశు శుక్లా గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
కొన్ని నిమిషాల తర్వాత వ్యోమనౌక రాకెట్ నుండి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారతీయులకు ఒక సందేశం పంపారు శుభాంశు శుక్లా.
‘ నమస్కారం, నా ప్రియమైన దేశవాసులారా. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం! 41 సంవత్సరాల తర్వాత మనం అంతరిక్షంలోకి చేరుకున్నాము. మరియు ఇది నిజంగా అద్భుతమైన క్షణం. ఈ సమయంలో వ్యోమనౌక సెకనుకు 7.5 కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ మధురమైన క్షణాన నా భుజంపై త్రివర్ణ పతాకం ఉంది. జాతీయ జెండా నాకు చెబుతోంది నీవు ఒంటరిగా కాదు, నీతో భారతీయులందరూ ఉన్నారని. ఇది నా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేసిన ప్రయాణం ప్రారంభం మాత్రమే కాదు, ఇది భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమానికి నాంది. మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇది గర్వ పడాల్సిన క్షణం. రండి, మనమందరం కలిసి భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమం యొక్క ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ధన్యవాదాలు. జై హింద్. జై భారత్.’ అని శుభాంశు శుక్లా పేర్కొన్నారు.