Shubhanshu Shukla Earth Return | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల చారిత్రాత్మక ప్రయాణం తర్వాత మంగళవారం భూమిపైకి సురక్షితంగా తిరిగి చేరుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమెరికా, కాలిఫోర్నియాలోని సముద్ర తీరంలో వీరి బృందం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. భూమిపైకి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు. శుభాంశు శుక్లా ISSలో మొక్కల పెరుగుదల, గురుత్వాకర్షణ ప్రభావాలపై అధ్యయనంతో సహా అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
తిరిగి వచ్చిన తర్వాత, శుభాంశు శుక్లాతో సహా వ్యోమగాముల బృందం 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఈ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో భూమి వాతావరణానికి అలవాటు పడేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా శుభాంశు శుక్లా సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం పట్ల ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ మిషన్ ప్రారంభమైన విషయం తెల్సిందే.