Shashi Tharoor’s “British Museum” Dig After Indian Man’s Bike Stolen In UK | తన బైక్ పై ప్రపంచ యాత్ర చేస్తూ ఓ భారతీయుడు యునైటెడ్ కింగ్డమ్ చేరుకున్నారు.
అయితే నాట్టింగహామ్ లో ఆయన బైక్ చోరీకి గురయ్యింది. దీనిపై స్పందించిన ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్ తనదైన శైలిలో యూకే దోపిడీ సంస్కృతిపై సెటైర్లు వేశారు. ముంబయి కి చెందిన 33 ఏళ్ల యోగేష్ తన కేటిఎం బైక్ పై ప్రపంచ యాత్రను ప్రారంభించారు.
17 దేశాల మీదుగా 24,000 కి.మీ. ప్రయాణించి ఇటీవలే యూకే చేరుకున్నారు. అయితే ఆగస్ట్ 28న కొందరు అతని బైక్ ను చోరీ చేశారు. బైక్ తో పాటు యోగేష్ పాస్పోర్ట్, డబ్బులు మరికొన్ని కీలక డాక్యుమెంట్స్ చోరీకి గురయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజగా శశిథరూర్ సైతం స్పందించారు. ‘బహుశా ఆ దొంగలు బ్రిటిష్ మ్యూజియం నుంచి స్ఫూర్తి పొందినట్లు ఉన్నారు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా క్షణాల వ్యవధిలోనే వైరల్ గా మారింది. శశిథరూర్ బ్రిటిష్ దోపిడీ పై అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని బలంగా వినిపిస్తుంటారు.
కాగా భారత్ తో పాటు వివిధ దేశాల్లో బ్రిటిష్ లూటీ చేసిన అనేక వస్తువుల్ని తమ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతుంది. ఈ క్రమంలోనే శశిథరూర్ ఈ విధంగా స్పందించారు.









