RTC Leaders Meet With Minister Ponnam | ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం,ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు తొలుగుతున్నాయని వివరించారు. ఈ సమయంలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మినిస్టర్స్ క్వాటర్స్ లో మంత్రిని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. మే 7 నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు నివేదించినా ప్రభుత్వం, యాజమాన్యం చర్చలకు ఆహ్వానించలేదని, ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆర్టీసీ జేఏసి తెలిపింది. ఈ తరుణంలో మంత్రి ఆర్టీసీ సంఘాల నేతలతో భేటీ అయ్యారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వినడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ రూ.1039కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 1500 కారుణ్య నియామకాలు పూర్తి చేసినట్లు అలాగే కొత్తగా 3,038 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ సమయంలో సమ్మె చేయవద్దని కోరారు.









