PM Modi Serious on Manipuri Incident | గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
ఈ నేపథ్యంలో మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం ఘాటుగా స్పందించారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు.
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయిందన్నారు.
ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని, ఘటనపై దేశం సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు.
మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు ప్రధాని మోదీ.
ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మణిపూర్ ఘటనకు పాల్పడిన ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.
మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని స్పష్టం చేశారు.