Fake Message | అమాయకులను టార్గెట్ చేస్తూ, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త పంథాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఏకంగా భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేరును వాడుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఇండియా పోస్ట్ పేరుతో ఫేక్ మెసేజ్ లు పంపిస్తూ వివరాలు తెలుసుకొంటున్నారు. తద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ‘మీ పార్శిల్ వచ్చింది. కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్ చేయండి. లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది”… ఇండియా పోస్ట్ పేరుతో మెసేజ్ లు పంపుతున్నారు.
ఇలాంటి నకిలీ సందేశాలను నమ్మి లింక్‌లపై క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆ లింక్‌ను నొక్కితే, వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు వీలుగా ఫిషింగ్ వెబ్‌సైట్‌కు దారి మళ్లుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ తరహా సందేశాలు పూర్తిగా నకిలీవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇండియా పోస్ట్ తమ వినియోగదారులకు ఇలాంటి లింక్‌లతో కూడిన సందేశాలు పంపదని తేల్చి చెప్పింది.
ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, తమ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు పీఐబీ సూచించింది. ఒకవేళ పొరపాటున ఇలాంటి మెసేజ్‌లు వస్తే, అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్ధారించుకోవాలని లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరింది.









