Pawan Kalyan pays tribute to his Karate coach Shihan Hussaini | మార్షల్ ఆర్ట్స్ లో తనకు శిక్షణ ఇచ్చిన గురువు షిహాన్ హుస్సేని మరణం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదనకు లోనయ్యారు. తాను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందినట్లు పేర్కొన్న పవన్ హుస్సేనీ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తనకు తెలిసిందని, ఆయన ఆరోగ్యం గురించి చెన్నైలోని తన మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపినట్లు చెప్పారు.
అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సైనీ గారిని పరామర్పించాలని నిర్ణయించుకొన్నట్లు, ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. చెన్నైలో హుస్సైనీ కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారని, ఆయన చెప్పినవి తాను కచ్చితంగా పాటించేవాడినని గుర్తుచేసుకున్నారు.
‘తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు, ‘ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు’ అన్నారు, ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు-నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సైనీ శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు’ అని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.