Pawan Kalyan congratulates Kamal Haasan | అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడెమీలో కమల్ హాసన్ కు చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ విషయమన్నారు. ఆస్కార్ కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో ఓటు వేసే అవకాశం ఆస్కార్ అకాడెమీలో ఉన్న వారికి ఉంటుంది.
ఈ ఏడాది కొత్తగా 534 మంది సభ్యులను ఆహ్వానించినట్లు అకాడెమీ తెలిపింది. ఇందులో భారత్ నుంచి కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాతో పాటు మరికొందరికి అవకాశం దక్కింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఆరు దశాబ్దాల అసాధారణ నటనా జీవితంతో కమల్ హాసన్ భారతీయ మరియు ప్రపంచ చలనచిత్ర రంగంపై చిరస్థాయి ప్రభావం చూపారని కొనియాడారు.
రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా చలనచిత్ర నిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన చూపిన అసాధారణ నైపుణ్యం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. కమల్ హాసన్ నిజమైన కళాకారుడని ప్రశంసించారు.









