Nitin Gadkari On Road Accidents In India | ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లో సమావేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
తాను జాతీయ రహదారుల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కానీ వాస్తవంలో మాత్రం యాక్సిడెంట్లను తగ్గించడం పక్కన పెడితే రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా రహదారుల పక్కన ట్రక్కులను నిలిపివేయడం ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. ఏడాదిలో సగటున ఒక లక్ష 78 వేల మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఇందులో 60 శాతం 18-34 ఏళ్ల వయసున్న వారేనని తెలిపారు.
అత్యధికంగా యూపీలో ఏటా 23 వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారని, ఆ తర్వాత తమిళనాడులో 18 వేల మంది, మహారాష్ట్రలో 15 వేల మంది మృత్యువాత పడుతున్నట్లు చెప్పారు. తన కుటుంబం కూడా గతంలో రోడ్డు ప్రమాదం బారిన పడినట్లు, ఈ అంశం తనకు చాలా సున్నితమైందన్నారు.