Naxal Leader Mallojula Venugopal Surrenders With 60 Naxalites | మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మంగళవారం గడ్చిరోలిలో సుమారు 60 మంది ఉద్యమ సహచరులతో పోలీసుల ఎదుట మల్లోజుల లొంగిపోయిన విషయం తెల్సిందే.
బుధవారం జరిగిన కార్యక్రమంలో మాల్లోజులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం పాల్గొన్నారు. తొలుత మల్లోజుల తన ఆయుధాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ తర్వాత లొంగిపోయిన ఇతర మావోయిస్టులు తమ తుపాకులను సీఎంకు అందజేశారు. వీరి నిర్ణయాన్ని ప్రశంసించిన సీఎం రాజ్యాంగ ప్రతులను అందజేశారు.
మల్లోజులపై వందకు పైగా కేసులు, రూ.6 కోట్ల రివార్డు సైతం ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్ర నేత లొంగిపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషణలు వస్తున్నాయి. మల్లోజుల అలియాస్ అభయ్, సోను, వివేక్, భూపతి పేర్లతో చలామణి అయిన ఆయన 44 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. తెలంగాణ పెద్దపల్లికి చెందిన మల్లోజుల తండ్రి వెంకటయ్య యొక్క తెలంగాణ సాయుధ పోరాటంతో స్ఫూర్తి పొందారు. అనంతరం అన్న పిలుపు మేరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సమయంలో పార్టీ వైఖరి సరిగా లేదంటూ పలుమార్లు బహిరంగ లేఖను విడుదల చేశారు. అలాగే దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణం అని పేర్కొంటూ పొలిట్ బ్యూరో నుంచి బయటకు వచ్చేశారు. తాజగా ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.








