Nara Lokesh News | ఇటీవల కాలంలో బెట్టింగ్ యాపుల మూలంగా లక్షలాది మంది సర్వస్వం కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనర్ బెట్టింగ్ యాపులపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ సైతం బెట్టింగ్ యాపుల మూలంగా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి పేరుతో ‘గోవింద’ అనే బెట్టింగ్ యాప్ పై నా అన్వేషణ తాజగా ఒక వీడియోను విడుదల చేశారు.
పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ ని కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారని, పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్ లలో యాప్ కోసం ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు.
యువతని బెట్టింగ్ యాపుల నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లను నా అన్వేషణ కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయని, జూదానికి బానిసైన యువత నిరాశలో నలిగిపోయి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
తాను వందలాది హృదయ విదారక సంఘటనల గురించి విన్నట్లు చెప్పారు.బెట్టింగ్ యాపులను నియంత్రించాలని తెలిపారు. వీటిపై నిరంతర అవగాహన మరియు బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని, మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పోస్ట్ చేశారు.