Mysterious Pneumonia In China | కోవిడ్ 19 (Covid 19)మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా పుట్టిన చైనాలోనే ఓ అంతు చిక్కని న్యుమోనియా (Mysterious Pneumonia) వేగంగా వ్యాప్తి చెందుతోంది.
చైనాలో అక్టోబరు మధ్య నుంచి ఈ న్యుమోనియా బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో మరో మహమ్మారి వస్తుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడి, ఆస్పత్రుల్లో చేరడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అప్రమత్తమైంది. పిల్లలలో అంతుచిక్కని న్యుమోనియా గురించి డబ్ల్యూహెచ్ఓ (WHO) హెచ్చరించింది.
ఈ వైరస్ ఉత్తర చైనా (North China)లో మొదటిసారి వ్యాప్తిలోకి వచ్చింది. న్యూమోనియా వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
దాదాపు రోజుకు 7 వేల మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.
దేశంలో శ్వాసకోస వ్యాధి కేసులు పెరుగుతున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు వెల్లడించినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
న్యూమోనియా వ్యాప్తిపై చైనా సీడీసీ ప్రకటన చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా సైతం అక్టోబరు నుంచి ఇన్‌ఫ్లూయెంజా పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్టు చూపుతోంది.
లక్షణాలు ఇలా ఉన్నాయి..
చైనాలోని ఈ కొత్తరకం న్యూమోనియా బాధితుల్లో దాదాపు కరోనా లక్షణాలే కనిపిస్తున్నట్లు తేలింది. జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం.
వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలుస్తోంది. కోవిడ్-19 మాదిరి లక్షణాలే ఉండటంతో ప్రాథమిక ప్రాథమిక పరీక్షలలో కొత్తరకం కరోనా కాదని తేలింది.
అయితే చైనా అధికార వర్గాలు మాత్రం కోవిడ్-19 ఆంక్షలు ఎత్తివేయడం, ఇన్‌ఫ్లూయోంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) లాంటి శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమని పేర్కొంటున్నారు.
డబ్ల్యూహెచ్ఓ తోపాటు, అంతర్జాతీయ వైద్య, ఆరోగ్య నిపుణుల సహకారంతో ఈ కొత్త రకం న్యుమోనియాకు కారణాన్ని గుర్తించడానికి చైనా అధికారులు కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉత్తర చైనాలోని ఈ వైరస్ వ్యాపిపై మరింత డేటా అందజేయాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆ దేశాన్ని కోరింది.