Man Thrashed Women For Voting BJP | మధ్య ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ లో బీజేపీకి ఓటు వేసినందుకు సమీనా అనే మహిళపై ఆమె బావ జావేద్ ఖాన్ దారుణంగా దాడి చేశాడు.
సెహోర్ జిల్లాలోని బర్ఖేదా హసన్ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాలు.. ఎంపీలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘లాడ్లీ బెహనా యోజన’కి మద్దతుగా సమీనా ఆ పార్టీకి ఓటు వేసింది.
డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దీంతో సమీనా మరుసటి రోజు తన పిల్లలతో కలిసి బీజేపీ విజయ సంబురాలు జరుపుకొంది. అయితే ఆమె బావ జావేద్ ఖాన్ కాంగ్రెస్ మద్దతుదారు కావడంతో సమీనా బీజేపీకి ఓటు వేయడాన్ని తప్పుబట్టాడు.
సోమవారం సాయంత్రం జావేద్ ఖాన్ నిర్దాక్షిణ్యంగా సమీనాపై కర్రతో దాడి చేసి, చెంపదెబ్బలు వేశాడు. సమీనా తన ఇష్టప్రకారం ఓటు వేశానని వివరించినప్పటికీ, అలాగే దాడికి పాల్పడ్డాడు. జావేద్ ఖాన్ భార్య కూడా అతడికి సహకరించింది
చివరికి బాధితురాలు ఈ ఘటనపై అహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన జావేద్ ఖాన్ పై సెక్షన్ 294, 323, 506 మరియు 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం జాతీయ పస్మాండ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నౌషాద్ ఖాన్‌తో కలిసి బాధితురాలు, ఆమె తండ్రి కలెక్టర్ ప్రవీణ్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తూ దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయం సీఎం దృష్టికి చేరడంతో శివరాజ్ సింగ్ చౌహన్ ఆ ముస్లిం మహిళను తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. సమీనాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.