MLA Kolikapudi Srinivasa Rao News | తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గిరిజన మహిళతో ఫోన్లో అత్యంత జుగుప్సాకరమైన సంభాషణ జరిపిన టీడీపీ నేతపై 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొలికపూడి ప్రకటించారు. అంతేకంటే ముందు రమేష్ రెడ్డి గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడారని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే..తిరువూరుకు చెందిన ఎంఏసీ మాజీ ఛైర్మన్ రమేష్ రెడ్డి ఓ మహిళతో అసభ్యకరంగా జరిపిన ఫోన్ సంభాషణపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తుల్ని నిలువునా పాతరేసిన తప్పులేదన్నారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఒకవేళ రమేష్ రెడ్డి పాల్గొంటే తానే చెప్పు తెగేవరకు కొడతానని హెచ్చరించారు.
తాను ఆడియో విన్నానని, ఇప్పటికే రాష్ట్ర, జిల్లా టీడీపీ అధ్యక్షులతో పాటు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పదిరోజులు దాటినా ఇప్పటివరకు అతడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అధిష్టానాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను పదవికి రాజీనామా చెస్తానని స్పష్టం చేశారు.