Annadatha Sukhibhava Scheme | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ (Annadatha Sukheebhava) పేరుతో రైతులకు ఏటా రూ.20వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏటా అర్హులైన రైతులందరికి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు అందజేస్తామని తెలిపారు.
పీఎం కిసాన్ రూ.6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధ చేకూరుతుందని తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్‌లలో రూ.20వేలు జమ చేస్తామని చెప్పారు. అదేవిధంగా యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, డ్రోన్ టెక్నాలజీని కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు.