Manchu Manoj Latest News | మంచు మోహన్ బాబు కుటుంబం ( Manchu Family )లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోమవారం మంచు మనోజ్ ( Manchu Manoj ), మోహన్ బాబు ( Mohan Babu ) పరస్పర ఫిర్యాదు లు చేసుకోవడం సంచలనంగా మారింది.
మనోజ్, ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ జల్ పల్లి ( Jalpally ) లోని నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన..తాను ఆస్థి, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేయడం, ఏడు నెలల తమ పాపను సైతం ఈ వ్యవహారం లోకి లాగడం సరికాదన్నారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరినట్లు, కానీ వారు తన మనుషులను బయటకు తోసేసి వేరే వాళ్ళని ఇంటి లోనికి పంపించారని మనోజ్ ఆరోపించారు.
ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అని మనోజ్ ప్రశ్నించారు. మద్దతు కోసం ప్రపంచంలో ఉన్న అందర్నీ కలుస్తానని మనోజ్ స్పష్టం చేశారు.