Man touches Mexican president while she speaks with citizens | మెక్సికో దేశ అధ్యక్షురాలికి ఓ భయానక ఘటన ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఓ వ్యక్తి అధ్యక్షురాలిని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు, అంతటితో ఆగకుండా ఆమెను అసభ్యంగా తాకాడు.
కానీ భద్రతా సిబ్బంది మాత్రం ఆలస్యంగా స్పందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ దేశ రాజధాని మెక్సికో నగరంలోని చారిత్రక కేంద్ర ప్రాంతానికి వెళ్లారు. అక్కడి వీధుల్లో ఆమె నడుచుకుంటూ ప్రజలతో మాట్లాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ప్రెసిడెంట్ సమీపంలోకి వచ్చారు. ఆమె మెడపై ముద్దు పెట్టాడు. దింతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
వెంటనే భద్రతా సిబ్బంది కలగజేసుకుని అతన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి మాత్రం అధ్యక్షురాలిని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆఖరికి తేరుకున్న సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేసింది. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేశ అధ్యక్షురాలిపైనే లైంగిక దాడి జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది ఆలస్యంగా స్పందించడం పట్ల మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధ్యక్షురాలు ఇప్పటివరకు స్పందించలేదు.









