Lavu Sri Krishna Devarayalu alleges massive liquor scam in AP During Jagan’s Rule | మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిందన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు రూ.1700 కోట్ల నుండి రూ.2000 కోట్ల వరకు వసూలు చేస్తే వైసీపీ హయాంలో మాత్రం కేవలం ఐదేళ్లలోనే అంతకు మించిన వసూళ్లు జరిగాయని లోకసభలో టీడీపీ ఎంపీ ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం లోకసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మద్యం కుంభకోణం మూలంగానే రాజ్యసభలో మరో నాలుగేళ్ళ పదవీ కాలం ఉండగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా.. జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్ దని ధ్వజమెత్తారు. జగన్ బంధువు సునీల్‌రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ.2 వేల కోట్లు తరలించారని, అలాగే 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయని టీడీపీ ఎంపీ తెలిపారు.
తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి రూ.వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్లేలా చేశారని వెల్లడించారు. ఇప్పటికే వీటి అన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించిందని, విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు.