India vs Pakistan weather update | టీ-20 వరల్డ్ కప్-2026లో అతి పెద్ద మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వరుణుడి గండం ఉండడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీలంక కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గ్రూప్ స్టేజిలో భాగంగా ఇరు జట్లు రెండేసి మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఇకపోతే టీ-20 వరల్డ్ కప్ లో దాయాధి దేశంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న టీం ఇండియా ఈసారి కూడా పాక్ ను బెంబేలెత్తించడానికి సిద్ధం అయ్యింది.
కానీ ఈ మ్యాచ్ కు వర్షం పడే సూచనలు అధికంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వర్షం కురిసింది. ఆదివారం మ్యాచ్ ప్రారంభం కంటే ముందు అంటే ఆరు గంటల-7 గంటల సమయంలో భారీ వర్షం, ఆ తర్వాత తేలికపాటి జల్లు కురిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఓవర్లను భారీగా కుదించి మ్యాచ్ జరపడం లేదా పూర్తిగా మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.









