Imanvi Ismail denies Pakistani links | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నటి ఇమాన్వి ఎస్మాయిల్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం లోని బైసరన్ లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఉగ్రవాదులకు అన్ని విధాలా సహకరించిన పాకిస్థాన్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
దింతో పాకిస్థాన్ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి ఎస్మాయిల్ పై కొందరు సంచలన పోస్టులు చేశారు.
ఆమె పాకిస్థానీ అని, ఇమాన్విని సినిమా నుండి బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తూ పోస్టులు చేశారు. కాగా సదరు పోస్టుల పై నటి తాజగా స్పందించారు. తాను పాకిస్థానీ కాదని స్పష్టంగా పేర్కొన్నారు. భారతీయత తన రక్తంలో ఉందన్నారు. తాను భారత్ అమెరికన్ అని చెప్పారు.
తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లి, అక్కడ స్థిరపడిన అనంతరం ఆ దేశ పౌరులుగా మారారని తెలిపారు. తాను అమెరికాలోననే చదివినట్లు, ఆ తర్వాత యాక్టింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ సమయంలోనే ఇండియన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు. తాను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గుజరాతి భాషల్లో మాట్లాడగలనన్నారు. కానీ తాను పాకిస్థానీ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.