Gurukula Student Shailaja Incident | రేవంత్ సర్కారు ( Revanth Govt. ) నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ బలైపోయిందన్నారు బీఆరెస్ నేత హరీష్ రావు ( Harish Rao ). శైలజ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ను వెంటాడుతదని దుమ్మెత్తిపోశారు.
25 రోజులుగా శైలజ వెంటిలేటర్ ( Ventilator ) మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండని హరీష్ విమర్శించారు.
తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిమ్స్ ( NIMS )ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.
చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ( Ex Gratia ) ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.