Govt caps domestic ticket prices after IndiGo chaos | దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో సంక్షోభం మూలంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇతర విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలు పెంచేశాయి. ప్రయాణికుల అవసరాన్ని అవకాశం చేసుకున్న సంస్థలు టికెట్ రేట్లు అత్యంత భారీగా పెంచేసి దోపిడీకి తెరలేపాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఓ వైపు ప్రయాణికులు విమానాశ్రయాల్లో అవస్థలు పడుతుంటే మరోవైపు టికెట్ల రేట్లు పెంచేసి ప్రయాణికులపై భారం మోపడం పట్ల కేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరల నియంత్రణ తీసుకువచ్చిన కేంద్రం వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎకానమీ క్లాసులో 500 కి.మీ. ప్రయాణం వరకు గరిష్టంగా రూ.7,500 ధరను నిర్ణయించింది.
500 కి.మీ.- 1000 కి.మీ వరకు రూ.12,000, 1000-1500 కి.మీ. వరకు రూ.15000, 1500 కి.మీ. దాటితే రూ.18 వేలుగా టికెట్ ధరలు ఉండలాని స్పష్టం చేసింది. అలాగే ఆదివారం రాత్రి 8 గంటల వరకు క్యాన్సల్, ఆలస్యం అవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రిఫండ్ పూర్తి చేయాలని శనివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల లగేజీని 48 గంటల్లోగా అప్పగించాలని పేర్కొంది









