Gold Rate | మన దేశంలో బంగారం (Gold Price) ధర రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 93 వేలకు చేరువలో ఉంది. అతికొద్ది రోజుల్లోనే అది లక్ష రూపాయాలు దాటిపోతుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సామాన్య ప్రజలు గోల్డ్ ప్రస్తావన ఎత్తడానికి జంకుతున్నారు. అయితే తాజాగా కొందరు నిపుణులు మాత్రం బంగారం ధర భారీగా తగ్గే చాన్స్ కూడా ఉందని అంచనా వేస్తునారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ, ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్‌స్టార్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో బంగారం ధర భారీగా పతనం అవుతుందని విశ్లేషించింది. 2025 ఏప్రిల్ 3 నాటికి, దేశీయ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 92,000 నుంచి రూ. 94,000 వరకు ఉంది. అయితే, ఈ ధరలు రూ.55,000 కంటే తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ తన తాజా రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుదల నమోదు కానుందని వివరించారు. బంగారం తవ్వకాలు పెరిగి.. సప్లై పెరుగుతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరపడటం, వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు బంగారం డిమాండ్‌ను తగ్గించవచ్చని ఆయన అంచనా వేశారు.