Dharmendra Death News | భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. యాక్షన్ స్టార్, యాక్షన్ హీరో, హీ మ్యాన్ వంటి బిరుదులు ధర్మేంద్ర సొంతం. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు ధర్మేంద్ర.
ధర్మేంద్ర మృతితో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇకపోతే ఈ అగ్ర నటుడికి భారత్ లోనే కాకుండా పాకిస్థాన్ లోనూ అభిమానులు ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధర్మేంద్రకు వీరాభిమాని. గతకొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర సోమవారం కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆసుపత్రిలో చేరిన ఆయన మరణించారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
సోమవారం మరణించిన ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్సులో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు నేరుగా శ్మశానవాటికకు చేరుకుని ధర్మేంద్ర పార్థివ దేహానికి నివాళులర్పించారు. 1960లో ‘దిల్ బీ తేరా హామ్ బీ తేరా’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. 1954లోనే ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. అయితే 1980లో నటి హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద వివాదంగా మారింది. 2004లో బికనీర్ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2012లో ఆయన్ను పద్మ భూషణ్ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్’ త్వరలో విడుదల కానుంది.










