Deputy Cm Pawan Kalyan News | భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిఎస్పీ వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో పవన్ ఫోన్లో మాట్లాడారు. భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారాలపై తనకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు.
భీమవరం డిఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి ఫోన్ లో మాట్లాడారు.
తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డిఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు.
ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డిఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.









