Delhi Blast – White-Collar Terror Module Exposed | ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. అంతకంటే ముందు హర్యానాలోని ఫరీదాబాద్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయ్యింది. ఇందులో తెలుగు అధికారి అయిన సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించారు. కర్నూలుకు చెందిన ఐపీఎస్ సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్ఎస్పీ గా పనిచేస్తున్నారు.
అక్టోబర్ నెలలో శ్రీనగర్ నౌగాం ప్రాంతంలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా కొందరు పోస్టర్లు అంటించారు. ఇవి పోలీసుల కంట పడింది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన సందీప్ చక్రవర్తి వెంటనే దర్యాప్తు కు ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన టీం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరు గతంలో సైన్యంపై రాళ్లు రువ్విన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అనంతరం ఆ ముగ్గురిని సందీప్ చక్రవర్తి మరియు ఆయన టీం విచారించింది. ఈ క్రమంలోనే భారీ ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ వెలుగులోకి వచ్చింది.
విచారణలో భాగంగా లభించిన సమాచారం ఆధారంగా జమ్మూ పోలీసులు అనంతనాగ్ మెడికల్ కాలేజీలో డాక్టర్ అదిల్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి హాస్టల్ లాకర్ లో ఏకే 47 లభ్యం అయ్యింది. ఆ తర్వాత జమ్మూ, హర్యానా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఫరీదాబాద్ లో డాక్టర్ ముజాహిల్ షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద నిల్వ చేసిన 2900 కేజీల పేలుడు పదార్దాలు, కెమికల్స్, ఆయుధాలు లభ్యం అయ్యాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ పై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించారు. పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత జరిపిన ‘ఆపరేషన్ మహాదేవ్’ లో కూడా ఐపీఎస్ అధికారి సందీప్ కీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే.









