Revanth Reddy Hot Comments | రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ మరియు బీఆరెఎస్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.
దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులు వారికి 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని అమెరికా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.
రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీశాఖా మంత్రి, బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని ధ్వజమెత్తారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు ఇవాళ , రేపు బీఆరెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చెయ్యాలని పార్టీ నేతలు కోరారు.
Revanth Reddy Sensational Comments | తెలంగాణ పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు.
సోమవారం అమెరికాలోని కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో సమావేశమయ్యారు.
అందులో భాగంగా ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధును కొనసాగిస్తారా అని ప్రశ్నించాడు.
అందుకు సమాధానంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం రైతులు మూడు లేదా నాలుగు ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
ఒక ఎకరం పొలానికి నీరు పట్టాలంటే గంట సమయం సరిపోతుందనీ, అలా మూడు నాలుగు గంటల్లో రైతు పొలం మొత్తం సాగు అవుతుందని పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆరెఎస్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ సంస్థల వద్ద కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: యూసీసీపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!
కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఐటీశాఖ మంత్రి బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రైతులకు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని కానీ వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు.
కాంగ్రెస్ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నేడు, రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆరెఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని కేటీఆర్ కోరారు.