Saturday 23rd November 2024
12:07:03 PM
Home > తాజా > ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

cm revath reddy

అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక

వ్యాధులపై ఆందోళన

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజులపాటు కార్యక్రమం

రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా

అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు.

ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా… రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా…? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.

ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్;

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,  జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.  అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.

డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

You may also like
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!
srikanth sravya
సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!
ktr comments
మంత్రుల ఫోన్  ట్యాప్ చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions