CM Revanth Reddy at Sant Sevalal Maharaj Jayanti Celebrations at Banjara Bhavan | నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని బంజారా భవన్ లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిదని వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు తనకు అండగా నిలబడ్డారని సీఎం పేర్కొన్నారు.









