CM Chandrababu Comments On YSR | దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుమలపై జగనే కాదు, నాడు వైఎస్ఆర్ కూడా ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా దేవసంగీతం అనే వ్యక్తిని నియమించారని యూనివర్సిటీలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఫోటోలను కూడా దేవసంగీతం తొలగించారని పేర్కొన్నారు. టీటీడీ గ్రాంట్స్తో నడిచే పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనే క్రైస్తవ మహిళను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వీసీగా నియమించారని ఆమె వేంకటేశ్వర స్వామి ఫోటోలు తీసి జీసస్ ఫోటోలు పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2005 నుంచే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలోనే హిందువులపై దాడి మొదలైందని ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేస్తూ అప్పటి పంచాయతీ రాజ్ కార్యదర్శి శామ్యూల్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. బ్రిటిష్ వాళ్లు కూడా తలపెట్టని దురాలోచనలను చేశారన్నారు. ఈ నిర్ణయంపై రెండేళ్ల పాటు దేశంలోని హిందువులంతా భగ్గుమన్నారని ఈ అంశంపై తాను కూడా పోరాటం చేసినట్లు ప్రస్తావించారు.










