Sensational Bill in Parliament | కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్ సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. తీవ్రమైన నేరానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులపాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఇతర ఏ మంత్రులనైనా వెంటనే పదవి తొలగించేలా ఈ బిల్లు ను రూపొందించారు.
కనీసం అయిదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి, అరెస్టయి, నెలరోజులు జైల్లో ఉంటే 31వ రోజున ఆటోమెటిక్ గా వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు.
తీవ్ర నేరారోపణ జరిగినప్పుడు వారంతట వారు రాజీనామా చేయకపోయినా ఈ కొత్త నిబంధన ప్రకారం తమ పదవిని కోల్పోతారు.
దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీలు గతంలో అరెస్టైనా తమ పదవులకు రాజీనామా చేయని విషయం తెలిసిందే.
130వ రాజ్యాంగ సవరణ ద్వారా హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టున్నారు. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి, అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.









