TKR To Join Congress | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆరెస్ పార్టీ(BRS Party)కి వరుసగా మరో ఎదురు దెబ్బ తగిలింది.
రాష్ట్రంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకున్న కాంగ్రెస్ నానాటికీ పుంజుకుంటోంది.
గ్రేటర్ లో బీఆరెస్ కు చెందిన కీలక నేత హస్తం గూటికి చేరనున్నారు. బీఆరెస్ కీలక నేత, మహేశ్వరం (Maheswaram) మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితతో కలిసి తీగల హస్తం గూటికి చేరనున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (Manick Rao Thackarey), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
ఈ మేరకు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Also: ప్రతిపక్షాల కూటమి పేరు ‘INDIA’.. అంటే అర్థం తెలుసా!
మంత్రి సబితకు పోటీగా..
మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సబిత (Sabitha Indrareddy) బీఆరెస్ లో చేరి మంత్రి పదవి చేపట్టారు.
దీంతో తీగల ఈ విషయంపై తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నారు. దీనికి తోడు రానున్న ఎన్నికల్లో టికెట్ విషయంలో ఆమెతో పోటిపడాల్సి వస్తుంది.
అధిష్టానం కూడా సబిత ఇంద్రారెడ్డికే టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పైగా మహేశ్వరంలో కాంగ్రెస్ లో కీలక నేతలెవరూ లేకపోవండ కూడా తీగలకు కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.
జూలై 20 కొల్లపూర్ లో జరగబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభ వేదికగా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.