Revanth Reddy Slams BJP For Stalling BC Reservation Bill Telangana | బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన ‘బీసీ ధర్నా’లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ పాదయాత్రలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ అని పేర్కొన్నారు.
బీసీలకు అన్యాయం చేస్తే నరేంద్రమోదీని గద్దె దించడం ఖాయం అన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధాని చేసి బీసీల రిజర్వేషన్లను సాదించుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మరియు ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆరెస్ అధినేత కేసీఆర్ బలహీన వర్గాల పై కక్ష కట్టి రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం తెచ్చారని, ఆ చట్టం ప్రస్తుతం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా నిషేధం విధించిందని తెలిపారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు.








