Groom Rejects ₹31 Lakh Dowry | తనకు వధువే ఒక కట్నం లాంటిదని , వరకట్నం వద్దు అంటూ అత్తమామ ఇచ్చిన రూ.31లక్షల నగదును తిరిగిచ్చేసి గొప్ప మనసు చాటుకున్నాడు ఓ యువకుడు.
ఈ ఘటన హరియాణ రాష్ట్రంలోని కురుక్షేత్రలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ సహారనపూర్ జిల్లాకు చెందిన వికాస్ రాణా ఒక న్యాయవాది. అతడి తండ్రి శ్రీపాల్ రాణా రాజకీయనాయకుడు. గతంలో బీఎస్పీ టికెట్ పై కైరానా లోకసభ నుండి పోటీ కూడా చేశారు. మరోవైపు వికాస్ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి.
వికాస్ కు మరియు హరియాణలోని లుఖ్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్ తో వివాహం ఖాయమయ్యింది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న పెళ్లి జరిగింది. ఇందు కోసం వికాస్ కుటుంబం కురుక్షేత్ర వెళ్లారు. అక్కడ ఒక హోటల్ లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తిలకం వేడుక సందర్భంగా అగ్రికా తన్వర్ తల్లిదండ్రులు వికాస్ కు రూ.31 లక్షల వరకట్నం అందజేశారు.
అయితే వరకట్నాన్ని వరుడు తిరిగి వధువు తల్లిదండ్రులకే ఇచ్చేసాడు. వరకట్నం వద్దని స్పష్టం చేశాడు. వరుడి సూచన మేరకు రూ.నాణెం, కొబ్బరికాయతో వివాహ క్రతువును పూర్తి చేశారు. కాగా వరకట్నం కోసం మహిళల్ని వేధిస్తున్న ఈ కాలంలో కట్నమే వద్దన్న వికాస్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.









