Rajasingh News Latest | గోశామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీకి కొత్తగా కాబోయే ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంపుగా ఉండకూడదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి త్వరలో బీజేపీ నూతన అధ్యక్షుడు వస్తారని చెప్పిన రాజాసింగ్, ఆయన్ను ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా లేక కేంద్ర నాయకత్వమా ? అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటే వచ్చే అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగా మిగలడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం నిర్ణయిస్తేనే బాగుంటుందని సూచించారు. గతంలో పని చేసిన ఓ అధ్యక్షడు గ్రూప్ రాజకీయాలు చేశారని దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. రాబోయే అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య భేటీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుల్ని పార్టీ గుర్తించడం లేదని, నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని వాపోయారు.
మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని కానీ, ఇస్తే వద్దనను అని తెలిపారు.అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నట్లు చెప్పారు. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని అసహనం వ్యక్తం చేశారు.









