YS Jagan On Tirupati Stampede Incident | తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan )పై విరుచుకుపడ్డారు.
తొక్కిసలాటలో 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని జగన్ దుమ్మెత్తిపోశారు.
మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎం తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంఏమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.