Ys Jagan News | బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా తన పర్యటనకు, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.
ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. ఇదే సమయంలో కొందరు రైతులు నిరసనలో భాగంగా రోడ్లపై మామిడి కాయలు పోశారని, కానీ ఇదేదో నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు రాయించడం చంద్రబాబుకే చెల్లిందని జగన్ ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వైఫల్యాలను ఎత్తిచూపితే తమపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.’ అని జగన్ సూచించారు.









