Wife caught stealing gold chain to pay off husband debts | అప్పుల భారంతో బాధ పడుతున్న భర్త కోసం భార్య చేసిన పని ఇప్పుడు ఆమెను వార్తల్లోకి ఎక్కించింది. త్వరగా అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కు పంపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ కు చెందిన రాజేష్ మరియు వరంగల్ జిల్లాకు చెందిన అనితా రెడ్డి రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గతంలో ఐటీ జాబ్ చేసిన అనిత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసిన రాజేష్ జాబ్ మానేశాడు. అయితే కుటుంబ పోషణ, ఇంటి ఖర్చుల కోసం రాజేష్ రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. ఇదే విషయంపై అతడు నిత్యం బాధ పడుతున్నాడు. భర్త ఆందోళనను గమనించిన భార్య, భర్త అప్పులు తీర్చేందుకు సహాయపడాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆమె అక్రమ మార్గాన్ని ఎంచుకుంది.
వేగంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో చైన్ స్నాచింగ్ కు పాల్పడింది. మియాపూర్ ప్రాంతానికి చెందిన కమల అనే మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలను కొట్టేయాలనుకుంది. లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో కమల మెడలో నుంచి బంగారు ఆభరణాలను లాగింది. అయితే ఈ సమయంలో కమల గట్టిగా కేకలు వేయడంతో భయపడిన అనిత చేతికందిన అర తులం నల్లపూసల గోలుసుతో పారిపోయింది. ఈ నేపథ్యంలో కమల సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేవలం అరగంటలోనే అనితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.









