Duration Of Stay | అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సంబంధించి ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాల పరిమితి విధించే ప్రతిపాదనలను ప్రకటించింది.
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై అమెరికాలో విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అక్కడ ఉండలేదు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది.
ప్రస్తుతం ఎఫ్-1 వీసాలపై అమెరికా (USA)లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చిన ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ వెసులుబాటు ఉంది.
అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్లో పాల్గొనాలనుకుంటే అంతకాలం అక్కడ ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్ట్లు, ట్రైనీలు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది.
అయితే, ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టమ్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఈ వీసాలకు కూడా గడువు విధించేలా ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరుచేయాలని ప్రతిపాదించింది.
అమెరికాలో విదేశీ విద్యార్థులకు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” అనే విధానం కింద నిరవధికంగా ఉండే అవకాశం లభించింది. ఈ కారణంగా చాలామంది విద్యార్థులు ఎప్పటికీ చదువుకుంటూనే ఉండే “ఫరెవర్ స్టూడెంట్స్”గా మారి అమెరికాలోనే స్థిరపడుతున్నారని ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయపడింది.









