Rishikonda Building | విశాఖలోని రుషికొండపై గత ప్రభుత్వంలో నిర్మించిన భవనం చుట్టూ టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే రుషికొండ భవనాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో స్పందించిన టీడీపీ రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి జల్సా ప్యాలెస్ ను కట్టుకున్నాడని, అందులో రూ. 26 లక్షల బాత్ టబ్ కూడా ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్పందించిన వైసీపీ,
” రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు.
అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని ఉదరగొడుతూనే ఉన్నాడు.
విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం లాంటి ముఖ్య వ్యక్తులు వచ్చినా నివాసం ఉండడానికి సరైన భవనం లేదని గుర్తించాలి” అని జగన్ పార్టీ తెలిపింది.