TTD To Allow Telangana Letters | తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ శుభవార్త చెప్పింది. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం లేదని పదే పదే వస్తున్న విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ప్రత్యేక చొరవతో తెలంగాణా ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించే విధానం అమలు కానుంది.
సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ (VIP Break) దర్శనం కేటాయించారు. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించారు. ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే 6 మందికి మించకుండా టీటీడీ దర్శనం కల్పించనుంది.
ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోదు. దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కోసం టీటీడీ లేఖలు స్వీకరించనుంది.
సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను విజ్ఞప్తి చేసింది.