Theft in Deputy CM Bhatti House | తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నివాసంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్న క్రమంలో ఇద్దరు దుండగులు చోరికి పాల్పడినట్లు సమాచారం.
చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని తనిఖీ చేయగా లక్షన్నర నగదు, వంద గ్రాముల బంగారు బిస్కెట్, కొంత విదేశీ కరెన్సీ, వెండి పాత్రలు, పెద్ద మొత్తంలో ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించగా బిహార్ కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. రోషన్ కుమార్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ్ ఇంటి కేర్‌టేకర్‌గా పని చేస్తున్నట్లు తేలింది.
రెండ్రోజుల క్రితం అతడి స్నేహితుడు ఉదయకుమార్ ఠాకూర్ తో కలిసి ఉపముఖ్యమంత్రి లేని సమయంలో ఇంట్లో తాళం పగులగొట్టి వస్తువులు, నగదు దొంగిలించి రైలులో పారిపోతున్నట్లు విచారణలో తేలింది.
విచారణ అనంతరం తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. అరెస్టు చేసిన వారిని ఖరగ్‌పూర్ కోర్టుకు తరలించారు.