CM Chandra Babu Tweet On Tirumala | తిరుమలలో (Tirumala Srivaru) శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్విట్టర్ వేదికగా ఓ కీలక పోస్ట్ చేశారు.
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడూ టీటీడీ నిబంధనలను పాటించాలని సీఎం కోరారు.
“కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టం.
ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.
తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలి.
భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దు” అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.