ఢిల్లీ వేదికగా కొత్త పార్టీని ప్రకటించిన గద్దర్
- “గద్దర్ ప్రజా పార్టీ”గా నామకరణం
- రానున్న అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ
Gaddar Party | తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఎన్నికలకు ఆరునెలల ముందు రాష్ట్ర రాజకీయ సిగలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ప్రజా నౌకగా పేరొందిన మాజీ నక్సలైటు, విప్లవ కవి గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు.
కొన్నేళ్ల క్రితం బుల్లెట్ పోరాటాలకు స్వస్తి పలికిన ఈ విప్లవ గాయకుడు తాజాగా బ్యాలెట్ తో బరిలో నిలవాలని నిశ్చయించుకున్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిసి తన కొత్త పార్టీ రిజిస్టర్ చేయాలని దరఖాస్తు చేశారు. తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ (Gaddar Praja Party)గా నామకరణం చేసినట్లు ఎన్నికల అధికారులను కలిసిన తర్వాత మీడియాతో వెల్లడించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR)పై మరోసారి విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్టు బంగారు తెలంగాణ నిర్మితం కాలేదని పుచ్చిపోయిన తెలంగాణ లా రాష్ట్రం పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
Gaddar (Gummadi Vital Rao)
ధరణి పేరుతో సీఎం భూములను మింగేశారని గద్దర్ ఆరోపించారు. ఈ దోపిడోళ్ల పార్టీని అధికారం నుంచి దింపేయాలన్న లక్ష్యం తోనే కొత్తపార్టీ (Gaddar Party)స్థాపిస్తున్నట్లు తెలిపారు.
ఓటు యుద్ధంలో దేశాన్ని దోచుకుంటున్న వారిపై పోరాటడానికి, కోట్లాది మందిని కదిలించడానికి మళ్లీ ప్రజల్లోకి వచ్చానని గద్దర్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. గద్దర్ ప్రజాపార్టీ జెండా మూడు రంగులతో ఉంటుందనీ, మధ్యలో పిడికిలి గుర్తు ఉంటుందని సమాచారం.
పార్టీ అధ్య క్షుడిగా గద్దర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ అనే పేర్లతో ఎన్నికల సంఘంలో రిజిస్ర్టేషన్ చేయిం చినట్టు తెలుస్తోంది.
ఒక కవిగా, రచయితగా, విప్లవ గాయకుడిగా ఈ మాజీ నక్సలైటు జన జీవన స్రవంతిలో కలిసిన ఆయన తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ వస్తే సామాజిక న్యాయం ద్వారా అణగారిన వర్గాలైన ఆదివాసులకు, దళితులకు న్యాయం జరుగుతుందని ఆశించి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ పోరులో తన పాటలతో యువతను, ఉద్యమకారులను చైతన్యపరిచారు.
అయితే స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ (KCR) పాలనను గమనించి, తాను ఆశించిన తెలంగాణ ఇది కాదని ఆయనతో విభేదించారు.
అప్పటి నుండి నేరుగా కేసీఆర్ పాలనే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.
Read Also: ఆ పార్టీవైపే పొంగులేటి, జూపల్లి.. ఉత్కంఠకు తెర!
తెలంగాణ దొరల పాలనలో మగ్గుతోందనీ.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని దొరల పాలన నుండి విముక్తి చెయ్యడానికి తాను పోరాటం చేస్తా అని 2018 లో నాటి కాంగ్రెస్ (Congress), టీడీపీ (TDP) కూటమి తరపున ప్రచారం కూడా చేశారు. అదే సమయంలో గద్దర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
కానీ, ఆ ఎన్నికల్లో వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెండోసారీ టీఆరెస్ అధికారం లోకి వచ్చింది. అయినప్పటికీ గద్దర్ అవకాశం దొరికినప్పుడల్లా, ప్రతి వేదిక పైన కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు.
అంతే కాకుండ కేసీఆర్ ని ప్రశ్నించే ప్రతి పార్టీ సభలో పాల్గొన్నారు. చివరికి తమతో సైద్ధాంతికంగా పూర్తిగా వ్యతిరేకమైన బీజేపీ చెంత కూడా చేరారు.
ప్రధాని మోదీని కూడా కలిశారు. కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకమైన దైవ కార్యక్రమాలలో కూడా పాల్గొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
గతేడాది జరిగిన మునుగోడు ఎన్నికల సమయం లో చివరికి ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత కొన్నాళ్లపాటు వార్తలకు దూరంగా ఉన్నా గద్దర్ తాజాగా తనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
మరి అంతో ఇంతో ప్రజాదరణ ఉన్న విప్లవ గాయకుడి పార్టీ కాస్తయినా గుర్తింపు తెచ్చుకుంటుందా..? లేదా ఎన్నికల సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే అనేక పార్టీల్లో ఒకటిగా మిగిలి“పోతుందా”..?
ప్రజా నౌక కనీసం ఎన్నికల తీరం చేరుతుందా లేదా నడిసంద్రంలోనే మునిగిపోతుందా.. వెయిట్ అండ్ సీ! ఎనీ వే.. ఆల్ ది బెస్ట్ టూ గద్దర్ ప్రజా పార్టీ.