Telangana Panchayati Elections | తెలంగాణ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామ పెద్ద పదవి కోసం భారీగా పోటీ పడుతున్నారు అభ్యర్థులు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదిలేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల నామినేషన్ చుట్టూ ట్విస్టులు కనిపించాయి. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి పరిధిలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకున్నాడు. కానీ సర్పంచ్ స్థానం ఎస్సి రిజర్వ్ అయ్యింది. ఈ క్రమంలో గత కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న శ్రీజ అనే యువతితో నామినేషన్ దాఖలు చేయించాడు. కథ ఇక్కడితో ఆగిపోలేదు. శ్రీజ నామినేషన్ వేయడం ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు నామినేషన్ ను ఉపసంహరించుకోవలన్నారు.
ఇదే సమయంలో కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రియురాలిని ఈలోపే వివాహం చేసుకున్న చంద్రశేఖర్ నేరుగా స్టేషన్ కు వెళ్లారు. ఇష్టపూర్వకంగానే నామినేషన్ దాఖలు చేసినట్లు సదరు యువతి స్పష్టం చేసింది. భర్త మద్దతుతో ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.









