–నిన్న రేవంత్ ను కలిసిన డీజీపీపై ఈసీ సస్పెన్షన్ వేటు
-ఏపీలో చాలా మంది పోలీసు అధికారులు బరి దాటుతున్నారన్న వర్ల
-అమాయకులను హింసిస్తున్నారని మండిపాటు
హైదరాబాద్ :తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న ప్రారంభమైన కాసేపటికే డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ డీజీపీని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ..అత్యుత్సాహంతో రేవంత్ ను కలిసిన తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేశారని చెప్పారు. తమ రాష్ట్రంలో చాలా మంది పోలీసు అధికారులు బరి దాటి… ముఖ్యమంత్రి దగ్గర ‘నీ బాంచెన్ దొరా’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, అమాయకులను హింసిస్తున్నారని మండిపడ్డారు. వీరిపై చర్యలను ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు.