Telangana CM Revanth Reddy’s delimitation warning | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నై వేదికగా డీలిమిటేషన్ పై జరిగిన అఖిలపక్ష సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
లోకసభ సీట్లను పెంచకుండా డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, వాజ్ పేయి కూడా ఇలానే చేశారని గుర్తుచేశారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, రాజకీయ గందరగోళం నెలకొనే అవకాశం ఉందన్నారు. దక్షిణాది ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ నష్టం కలిగిస్తుందని, ఈ ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ఖజానాకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో పన్నులు కడుతూ తక్కువ నిధులు పొందుతున్నాయని తెలిపారు.
రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు కేవలం 16 పైసలే తిరిగివస్తున్నాయని చెప్పారు. కానీ అదే బీహార్ కు రూ.6.06 పైసలు, యూపీకి రూ.2.03 పైసలు, మధ్యప్రదేశ్ కు రూ.1.73 పైసలు తిరివస్తున్నాయన్నారు.