CM Revanth Delhi Tour | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అధికారిక పర్యటనతో పాటు పార్టీకి సంబంధించిన విషయాలపై కూడా సీఎం రేవంత్ అధిష్ఠానంతో చర్చించనున్నారు.
పార్టీ అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నట్లు సమాచారం. ఈ టూర్‌లో మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా తెలంగాణ కేబినెట్ మంత్రులు 18 మంది ఉండాల్సింది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రులు ఉన్నారు.
ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌మోహన్‌రావు, వాకిటి శ్రీహరి, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం.
ఇవే కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి, చీఫ్ విప్‌లను కూడా భర్తీ చేసే అవకాశం ఉండొచ్చు. మరోవైపు పీసీసీ అధ్యక్ష మార్పుపై ప్రచారం జరుగుతుంది. రేవంత్ స్థానంలో బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, మహేష్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.