Telangana Anthem Writer Andesri Passes Away at 64 | ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ పాత్ర అజరామరం. ఆయన గీతాలు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
‘తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని తెలిపారు.
అందెశ్రీ మృతి పట్ల కేసీఆర్ స్పందిస్తూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.









