Tej Pratap hasn’t paid power bill of his home in 3 years | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గత మూడేళ్ళుగా కరెంట్ బిల్లు చెల్లించలేదని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం గవర్నమెంట్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే పట్నాలోని తన వ్యక్తిగత ఇంటికి మాత్రం మూడేళ్ళుగా కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది.
20 జులై 2022న తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఇంటి కరెంట్ బిల్లుగా రూ.1,04,799 చెల్లించారు. అప్పటి నుండి నవంబర్ 2025 వరకు ఒక్కసారి కూడా కరెంట్ బిల్లు చెల్లించకపోవడం గమనార్హం. జరిమానాలతో కలిపి ఇప్పుడు ఆ బిల్లు రూ.3.61 లక్షలకు చేరింది. బీహార్ లో రూ.25 వేలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉంటే కనెక్షన్ ను డియాక్టీవేట్ చేయాలి. కానీ అలా జరగలేదు. ఇకపోతే తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు మీద ఉన్న మరో విద్యుత్ కనెక్షన్ బిల్లు కూడా భారీగా పేరుకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా జరిమానాలతో కలిపి రూ.3.24 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇకపోతే ఈ వివాదం కాస్తా బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.









